పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0102-01 లలిత సం: 02-007 అధ్యాత్మ

పల్లవి: ఒల్లఁడు గాక దేహి వుద్యోగించఁడు గాక
కొల్లలైన మేలు తనగుణములో నున్నది
    
చ. 1: తలఁచుకొంటేఁ జాలు దైవమేమి దవ్వా
నిలుచుక తనలోనే నిండుకున్నాఁడు
చలపట్టితేఁ జాలు సర్గమేమి బాఁతా
చలివేఁడి నాలికపై సత్యములో నున్నాఁడు
    
చ. 2: ఆయమెఱిఁగితేఁ జాలు నాయుష్యము గరవా
కాయపుటూపిరిలోనే గని వున్నది
చేయఁబోతే పుణ్యుడుగా జీవునికిఁ దడవా
చేయారఁ గర్మము తనచేతిలోనే వున్నది
    
చ. 3: మొక్క నేరిచితేఁ జాలు మోక్షమేమి లేదో
యెక్కువ శ్రీవేంకటేశుఁ డిదె వున్నాఁడు
దక్కఁగొంటేఁ జాలు పెద్దతనమేమి యరుదా
తక్కక శాంతముతోడి దయలోన నున్నది