పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/389

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0178-04 గుండక్రియ సం: 02-389 వైరాగ్య చింత

పల్లవి:

అదియేల తా మాను మాయందు నిష్టూరమే కాక
చెదరి విత్తొకటియుఁ జెట్టొకటి యౌనా

చ. 1:

కడుఁ బుణ్యపాపాలు గలిగిన జన్మము
చెడుఁ బుణ్యపాపాలు సేయకుండీనా
పుడమిలో ముష్టిమానఁ బొడమిన శాఖలు
బడి ముష్టిపండ్లై పండకుండీనా

చ. 2:

పంచేంద్రియాలఁ బుట్టి పరగిన యీమేను
పంచేంద్రియాలమీఁది భ్రమ మానీనా
పొంచి హేయములోనఁ బుట్టిన కీటములెల్ల
కొంచి హేయమే చవిగొనకుండీనా

చ. 3:

శ్రీవేంకటేశ నీవుచేసిన యీమాయలు
నీవల్ల మానుఁ గాక నేఁ గర్తనా
దైవమవై నాలోనఁ దగిలి నాదుర్గుణాలు
వేవేగ మానుపఁగ వెతదీరెఁ గాక