పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/388

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0178-03 లలిత సం: 02-388 వైరాగ్య చింత

పల్లవి: అంతరాత్మ హరి గలఁడంతే చాలు
యెంతకెంత చింతించనేలా వెరవ

చ. 1: వెనక జన్మపు గతి వివరించి నే నెరగ
అనుగు మీఁదటి జన్మమది యెఱగ
ననిచి యీ జన్మము నానాఁట దెలిసేము
యెనసి యీ భవములకేలా వెఱవ

చ. 2: నిన్నటి దినము కత నిమిషమై తోఁచీని
కన్నుల రేపటి చేఁత కానఁగరాదు
పన్ని నేఁటి దినము మున్ను నోఁచినట్లే
యెన్నఁగ నెందుకునైనానేలావెఱవ

చ. 3: పరము నిహము నేఁ బైకొన నా యిచ్చగాదు
హరి శ్రీవేంకటపతి యఖిలకర్త
శరణంటి నాతనికి స్వతంత్ర మతనిది
యిరవైతి నింకా నాకేలా వెఱవ