పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/384

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0177-03 గుజ్జరి సం: 02-384 భగవద్గీత కీర్తనలు

పల్లవి: ఉపకారి దేవుఁడు అపకారి గాఁడు

చ. 1: దేహం బొసఁగెను దేవుఁడు తనుఁ దెలియఁగ శాస్త్రము గడియించె
దేహాంతరాత్ముఁడు మరి దేహచైతన్యుఁడా దాను
దేహి యేలోకంబున కేఁగిన దేవుఁడు దా వెంటనే యేఁగును
దేహి కోరినట్టే కమ్మర దేవుఁ డనుమతి ఇచ్చీఁ గాన

చ. 2: చేయుటకును చేయకమానుటకును జీవుఁడు స్వతంత్రుఁడా యంటేను
కాయపుసుఖములు గోరఁగ గర్తట కడగనుటకుఁ గర్త గాఁడా
యీయెడ నాయెడ నంతర్యామే యిన్నిటికినిఁ బ్రేరకుఁడింతే
దాయక పాయక తనతలఁపుకొలఁది దైవమే సృజియించీఁ గాన

చ. 3: ఇవి యెరిఁగి చిత్తమా నీ వితనందే అభిరతి సేయుము
సదయుఁడు మనశ్రీవేంకటగిరి సర్వేశ్వరుఁడు సత్యుఁడు
మొదలనే యీయర్థము కిరీటితో మొగి నానతి ఇచ్చినాఁడు
అదే "నమోఽహం సర్వభూతేషు" అని గీతలలో నున్నది గాన