పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/383

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0177-02 లలిత సం: 02-383 భగవద్గీత కీర్తనలు

పల్లవి: విజాతులన్నియు వృథా వృథా
అజామిళాదుల కది యేజాతి

చ. 1: జాతిభేదములు శరీరగుణములు
జాతి శరీరము సరిఁ దోడనె చెడు
ఆతుమ పరిశుద్ధంబెప్పుడును అది నిర్దోషం బనాది
యీతల హరివిజ్ఞానపు దాస్యంబిది యొక్కటెపో సుజాతి

చ. 2: హరి యిందరిలో నంతరాత్ముఁడిదె
ధరణి జాతిభేదము లెంచిన
పరమయోగులీ భావ మష్టమదము భవవికారమని మానిరి
ధరణిలోనఁ బరతత్త్వజ్ఞానము ధర్మమూలమే సుజాతి

చ. 3: లౌకిక వైదిక లంపటులకు నివి
కైకొను నవశ్యకర్తవ్యంబులు
శ్రీకాంతుండు శ్రీవేంకటపతి సేసిన సంపాదమిందరికి
మేకొని యిన్నియు మీరినవారికి మీనామమే సుజాతి