పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/376

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0176-02 దేవగాంధారి సం: 02-376 శరణాగతి

పల్లవి: అందుకే నేఁ జింతించెదను అచ్యుత నీశరణాగతుఁడ
సందడి నాభవ మిందువల్లనే నఫలంబాయనయ్యా

చ. 1: వొకనీనామము వొగిఁ దలంచిన
అకలంకంబగు నాపాపంబులు అన్నియుఁ బారణే సేసే
అకటా తక్కిన అనంతనామములు
వొకట నుపవాసములున్నవోయయ్యా

చ. 2: పరి నీపాదము లవి రెండే
పరమును విహమును నా కొసఁగెను పయిపైఁ గృపతోడ
ధర నీయనంతకరములు తా మేమి-
సిరు లిత్త మనుచు చెలఁగీనయ్యా

చ. 3: ఇల నీదాస్యం బిది యొకటే
సిలుగుల భవముల జిలుగు మాన్పె నదె చిత్తము తహ దీర
యెలమిని శ్రీవేంకటేశ్వర నీ విదె
తలఁపునఁ బాయక దక్కితివయ్యా