పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0169-02 దేవగాంధారి సం: 02-334 వైష్ణవ భక్తి

పల్లవి: ఇంతకంటే మరిలేదు యెవ్వరికి నుపాయము
యెంతైనా నిదియు నీ విచ్చితేనే కలుగు

చ. 1: హరి నీచిత్తము వట్టేయందుకు నుపాయము
ధర నిన్ను బోధించే నీదాసులమాఁటే
దురతములన్నిటిని తొలగించే వుపాయము
నిరంతరమును నీనామజపమే

చ. 2: దండితోడ నీమాయ దాఁటేయందు కుపాయము
నిండు నిధానమైన నీపైభక్తే
అండనున్న కామాదుల నణచుట కుపాయము
కొడవంటి నీమూర్తిఁ గోరి శరణనుటే

చ. 3: పుట్టుగులు గెలిచి నిన్ను బొందుట కుపాయము
అట్టె నీరూపమైన‌ ఆచార్యుడే
యిట్టె శ్రీవేంకటేశ యిన్నిటికి నుపాయము
మట్టులేని రామానుజమతము చేకొనుటే