పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0106-01 శంకరాభరణం సం: 02-031 దశావతారములు

పల్లవి: ఇందుకేపో వెరగయ్యీ నేమందును
కుందులేని నీమహిమ కొనియాడఁగలనా
    
చ. 1: అటు దేవతల కెల్ల నమృతమిచ్చిన నీవు
యిటు వెన్నదొంగిలుట కేమందును
పటుగతి బలీంద్రుని బంధించినట్టి నీవు
సట రోలఁ గట్టువడ్డ చందాన కేమందును
    
చ. 2: కలిగి యాకరిరాజుఁ గరుణఁ గాచిన నీవు
యిల నావులఁ గాచుట కేమందును
తలఁప బ్రహ్మాదిదేవతలకుఁ జిక్కని నీవు
చెలుల కాఁగిళ్లకుఁ జిక్కితి వేమందును
    
చ. 3: భావించ నన్నింటకంటేఁ బరమమూ ర్తివి నీవు
యీవల బాలుఁడవై తి వేమందును
కావించి బ్రహ్మాండాలు కడుపున నిడుకొని
శ్రీవేంకటాద్రి నిలిచితి వేమందును