పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0101-02 ఆహిరి సం: 02-002 అధ్యాత్మ

పల్లవి: విడువరా దెంతైనా వెఱ్ఱివాఁడనైన నీకు
కడవారు నవ్వకుండాఁ గాచుకో నన్నును
    
చ. 1: జ్ఞానము నే నెఱఁగ నజ్ఞానముఁ నే నెఱఁగను
మానను విషయములు మరిగెంతైనా
నీనామము నొడిగి నాదాసుఁడ ననుకొందు
దీనికే వహించుకొని తిద్దుకో నన్నును
    
చ. 2: అకర్మము నెఱఁగను సుకర్మము నెఱఁగను
ప్రకటసంసారముపై పాటు మానను
వొకపనివాఁడనై వూని ముద్రధారినైతి
మొకమోడి యిందుకే గోమున నేలు నన్నును
    
చ. 3: వెనకఁ గానను ముందు విచారించి కానను
నినుపై దేహధారినై నీకు మొక్కేను
ఘనుఁడ శ్రీవేంకటేశ కన్నులెదుటఁ బడితి
కని పోవిడువరాదు కరుణించు నన్నును