పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0105-04 సాళంగనాట సం: 02-028 అధ్యాత్మ

పల్లవి: నాకు నందు కేమివోదు నన్ను నీ వేమిచూచేవు
నీకరుణ గలిగితే నించి చూపవయ్యా
    
చ. 1: ఘోరమైన దేహపు దుర్గుణ మేమిగలిగిన
ఆరసిఁ బ్రకృతిఁబోయి అడుగవయ్యా
నేరని నాజన్మముతో నేరుపేమి గల్లా నన్ను
ధారుణిఁ బుట్టించిన విధాత నడుగవయ్యా
    
చ. 2: పంచేంద్రియములలోని పాప మేమి గలిగినా
అంచెలఁ గామునిఁబోయి అడుగవయ్యా
ముంచిన నాకర్మములో మోసమేమి గలిగినా
మంచితనానఁ జేయించే మాయ నడుగవయ్యా
    
చ. 3: అన్నిటా నావెనకటి‌ అపరాధమేమి గల్లా
మన్నించి నాగురుఁ జూచి మానవయ్యా
మిన్నక శ్రీవేంకటేశ మీఁదిపనులేమి గల్లా
నిన్నుఁ జూచుకొని నన్ను నీవే యేలవయ్యా