పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0213-06 శంకరాభారణం సం: 03-078 అధ్యాత్మ

పల్లవి:

ఉన్నచోనే మూఁడులోకా లూహించి చూచితే నీవే
కన్నచోటనే వెదకి కానఁడింతేకాక

చ. 1:

యెక్కడ వొయ్యెడి జీవుఁ డేది వైకుంఠము
యిక్కడ హరి యున్నాఁడు హృదయమందె
ముక్కున నూరుపు మోచి ముంచి పుణ్యపాపాల
కక్కసానఁ జిక్కి తమ్ముఁ గానఁడింతేకాక

చ. 2:

యేమి విచారించీ దేహి యెందు దేవుని వెదకీ
కామించి యాతఁ డిన్నిటాఁ గలిగుండఁగా
దోమటి సంసారపు దొంతికర్మములఁ జిక్కి
కాముకుఁడై కిందుమీఁదు గానఁడింతేకాక

చ. 3:

యే విధులు తాఁ జేసీ యెవ్వరి నాడఁగఁబోయీ
శ్రీవేంకటేశ్వరు సేవచేత నుండఁగా
భావ మాతఁడుగాను బ్రతికె నిదివో నేఁడు
కావరాన నిన్నాళ్లు కానఁడింతేకాక