పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/572

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0298-05 సామవరాళి సం: 03-570 మాయ

పల్లవి:

ఏ వల్ల నౌఁగాము లిఁక నేవి అన్నియు నీలోనే
శ్రీవల్లభుఁడ నిన్నుఁ జేఱితిమి నేము

చ. 1:

సగుణనిర్గుణములును సావయవనిరవయవ-
మగుఁ దర్కవాదకలహములు ఘనము
జగములో చదువులును సంశయంబే కాని
తెగనీదు నీ మాయ తెలియ వసమా

చ. 2:

వేదమార్గము గొంత వేదబాహ్యము గొంత
పోది మతములవారి పోరు ఘనము
పాదైన మునిరుషులు బహుముఖములే కాని
సోదించి వొకమాట చూపంగ లేరు

చ. 3:

వెస గర్మ మొకవంక విజ్ఞాన మొకవంక
వసగావు రెంటి బలవంతములును
వసుధ శ్రీవేంకటేశ్వర నీవు గావు మిఁక
ముఁసుగు వెట్టినవాదు ముగియదెంతైనా