పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/570

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0298-03 వరాళి సం: 03-568 ఉపమానములు

పల్లవి:

అతనిలోనే యణఁగె నన్నియును
కతలెన్నైనాఁ గలవు కమలాక్షుఁ గనరో

చ. 1:

యిసుక లెక్కవెట్టితే నెంతై నాఁ గలదు
అసముదించని పుణ్యా లటువంటివే
వసగాని పెక్కు దేవతలఁ గొలుచుకంటే
సుసరాన హరివారై సుఖియించరో

చ. 2:

గోడ గడుగఁగఁ బోతేఁ గొనదాఁకా రొంపే
ఆడుకోలు తర్కవాదా లటువంటివే
వాడిక నారుమతాలవాఁడై తిరుగుకంటే
యీడనే శ్రీపతివారై యీడేరరో

చ. 3:

మనసునఁ బాలు దాగితే మట్టు లేదు మేర లేదు
అనుగు సంసారభోగా లటువంటివే
దినదిన తపముల దీదీపులవుకంటే
తనిసి శ్రీవేంకటేశుదాసులై బ్రదుకరో