పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/565

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0297-04 సాళంగం సం: 03-563 విష్ణు కీర్తనం

పల్లవి:

ఒక్కఁడే దైవం బున్నతుఁ డీతఁడు
తక్కిన తలఁపులు తప్పుఁదెరువులు

చ. 1:

పురుషుల కెల్లాఁ బురుషోత్తముఁడు
సురేంద్రాదులకు సురేంద్రుఁడు
హరునికి నజునికి నవ్వలిమూరితి
హరి ఇతఁడే పరమాత్ముఁడు

చ. 2:

వేదాంతంబుల వేద్యుఁ డీతఁడు
ఆదికినాదియు నన నితఁడే
మేదిని నరులకు మేదినీశ్వరుఁడు
యేదెసఁ జూచిన నీశ్వరుఁ డితఁడే

చ. 3:

యెక్కువల కెల్ల నెక్కువ యీతఁడు
మక్కువ మరునికి మరుఁ డితఁడు
యిక్కడ శ్రీవేంకటేశుఁడై మిగుల
పక్కన నిదివో ప్రత్యక్ష మితఁడు