పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/502

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0287-01 సాళంగనాట సం: 03-500 హనుమ

పల్లవి:

అదివో నీప్రతాపము హనుమంతా
యెదురులేదు నీకు నెక్కడా హనుమంతా

చ. 1:

యెత్తిననీ కుడిహస్త మిల నసురలు చూచి
హత్తిరి పాతాళము హనుమంతా
చిత్తగించి నీ యెడమ చేతి పిడికిటికి
తత్తరించి చిక్కిరదె దైత్యులు హనుమంతా

చ. 2:

నలియఁ దొక్కిన నీ వున్నతపుఁ బాదముకింద-
నలమటించే రరులు హనుమంతా
చలపట్టి నీవు జంగ చాఁచిన పాదహతిని
బలుదానవులు భంగపడిరి హనుమంతా

చ. 3:

వడి నీవు మీఁదికి వాలమల్లార్చిన
అడఁగిరి రాక్షసులు హనుమంతా
బడినే శ్రీవేంకటేశుపంపున నీవు గెల్వఁగ
బెడిదమై పొగడేరు పెద్ద హనుమంతా