పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0209-01 దేసాక్షి సం: 03-049 భక్తి

పల్లవి:

నీవే నేరవుగాని నిన్నుఁ బండించేము నేము
దైవమా నీకంటే నీదాసులే నేర్పరులు

చ. 1:

వట్టి భక్తి నీ మీఁద వళుకువేసి నిన్నుఁ
బట్టి తెచ్చి మతిలోనఁ బెట్టుకొంటిని
పట్టెడు దులసి నీపాదములపై బెట్టి
జట్టిగొనిరి మోక్షము జాణలు నీదాసులు

చ. 2:

నీవు నిర్మించినవే నీకే సమర్పణసేసి
సోవల నీకృపయెల్లఁ జూరగొంటిమి
భావించొకమొక్కు మొక్కిభారము నీపై వేసిరి
పావనపు నీదాసులే పంతపు చతురులు

చ. 3:

చెరువుల నీళ్లుదెచ్చి చేరఁ(రె?)డు నీపైఁ జల్లి
వరము వడసితిమి వలసినట్టు
యిరవై శ్రీవేంకటేశ యిటువంటి విద్యలనే
దరిచేరి మించిరి నీదాసులే పో ఘనులు