పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/493

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు:0285-04 రామక్రియ సం: 03-491 విష్ణు కీర్తనం


పల్లవి :

అన్నిటి మూలం బతఁడు
వెన్నుని కంటెను వేల్పులు లేరు


చ. 1:

పంచభూతముల ప్రపంచ మూలము
ముంచిన బ్రహ్మకు మూలము
పొంచిన జీవుల పుట్టుగు మూలము
యెంచఁగ దైవము యితఁడే కాఁడా


చ. 2:

వెనుకొని పొగడేటి వేదాల మూలము
మునుల తపములకు మూలము
ఘనయజ్ఞదుల కర్మపు మూలము
యెనలేని దైవ మితఁడే కాఁడా


చ. 3:

అగపడి సురలకు నమృత మూలము
ముగురు మూర్తులకు మూలము
నగు శ్రీవేంకటనాథుఁడే మూలము
యెగువ లోకపతి యితఁడే కాఁడా