పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/492

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0285-03 వరాళి సం: 03-490 వైష్ణవ భక్తి


పల్లవి :

ఇది చాలదా మమ్ము నీడేర్చను
అదన నెవ్వఁ డెరుఁగు నటమీఁది పనులు


చ. 1:

ఇట్టె పంచసంస్కారా లెచ్చోట నుండినాను
పట్లైనవారే మాకుఁ బ్రమాణము
మట్టుగ నీరూపనామము లెందు నుండినాను
కట్టఁగడవారైన ఘనపుణ్యులు


చ. 2:

పలుక వైష్ణవవేషభాష లెందు నుండినాను
వలనుగ మాకు సహవాసయోగ్యులే
తలకొన్న దాసానుదాస్య మెందు నుండినాను
అల కర్మదూరులైన నంతరంగులు


చ. 3:

యెక్కువ సంకీర్తన మెచ్చోట నుండినాను
అక్కడ పరమపద మది భాగ్యము
చక్కఁగ వేదశాస్త్రసమ్మతము నిదియే
పక్కన శ్రీవేంకటేశు పరమార్థము నిదే