పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/473

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు:0282-02 రామక్రియ సం: 03-471 తిరుపతి క్షేత్రం


పల్లవి :

కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ


చ. 1:

వేదములే శిలలై వెలసినది కొండ
యేదెసఁ బుణ్యరాసులే యేరులైనది కొండ
గాదిలి బ్రహ్మాదిలోకముల కొనల కొండ
శ్రీదేవుఁడుండేటి శేషాద్రి యీకొండ


చ. 2:

సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ
నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ
వుర్విఁ దపసులే తరువులై నిలిచిన కొండ
పూర్వపు టంజనాద్రి యీ పొడవాటి కొండ


చ. 3:

వరములు కొటారుగా వక్కణించి పెంచే కొండ
పరగు లక్ష్మీకాంతు సోబనపుఁ గొండ
కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ
విరివైన దిదివో శ్రీవేంకటపుఁ గొండ