పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/472

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0282-01 లలిత సం:03-470 విష్ణు కీర్తనం


పల్లవి :

అతఁడే పరబ్రహ్మ మతఁడే లోకనాయకుఁ-
డతనికంటే మరి యధికులు యేరయ్యా


చ. 1:

కమలవాసిని లక్ష్మి కలదా యెవ్వరి కైనాఁ
గమలనాభునికి నొక్కని కే కాక
కమలజుఁడైన బ్రహ్మ కలఁడా యెవ్వని నాభి-
సమరవంద్యుఁడు మా హరికే కాక


చ. 2:

అందరు నుండెడి భూమి యన్యులకుఁ గలదా
అందపు గోవిందునికే ఆలాయఁగాక
చెందిన భాగీరథి శ్రీపాదాలఁ గలదా
మందరధరుఁడయిన మాధవునికిఁ గాక


చ. 3:

నిచ్చలు నభయమిచ్చేనేరుపు యెందుఁ గలదా
అచ్చుగ నారాయణునియందే కాక
రచ్చల శరణాగత రక్షణ మెందుఁ గలదా
తచ్చిన శ్రీవేంకటాద్రిదైవానకే కాక