పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/434

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0275-03 లలిత సం: 03-432 దశావతారములు


పల్లవి :

రామకృష్ణ నీవు నందే రాజ్య మేలుచుండుదువు
యేమి సేసే విక్కడ నీ యిరవుకే పదవే


చ. 1:

లంక విభీషణు నుంచ లక్ష్మణుని నంపినట్టు
అంకె సుగ్రీవుఁ గిష్కింధ కంపినయట్టు
వంకకు సంజీవి దేను వాయుజుని నంపినట్టు
వేంకటాద్రి పొంతనుండ వేగ మమ్ము నంపవే


చ. 1:

ఘనకిరీటము దేను గరుడని నంపినట్టు
అనుఁగుఁ గపుల నిండ్ల కంపినట్టు
వొనర గోపికలొద్ది కుద్ధవుని నంపినట్టు
ననువు శేషాద్రినుండ నన్ను పంపవే


చ. 1:

పెండిలికిఁ బరుషలఁ బిలువఁగ నంపినట్టు
అండనే ముందరఁ గంత కంపినయట్టు
వెండియు శ్రీవేంకటేశ వేఁట వచ్చి మరలితి -
వుండ (డు?) చోట నుండి నన్ను వూడిగాన కంపవే