పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/433

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0275-02 లలిత సం: 03-431 అద్వైతము


పల్లవి :

అన్నిటికి నారదాదు లదివో సాక్షి
యిన్నిటా మాకుఁ గలిగె నేమైనాఁ గాని


చ. 1:

భూమిలోన నెన్నియైనా పుణ్యములు గలవు
కామింప నాచారాలు కల వెన్నెనా
సామజవరదు నొక్కసారె దలఁచినందుకు
యేమియును సరిగావు యెట్టయినాఁ గాని


చ. 2:

వుత్తమలోకసుఖము లోగి నెన్నైనాఁ గలవు
యిత్తల సిరులు గల విల నెన్నైనా
చిత్తజగురుని నటు సేవించే పుణ్యమువలె
నిత్తెము గావు గాని నిచ్చలు నెంతైనను


చ. 3:

కలవు మతాలు గొన్ని కలవు ముక్తులు గొన్ని
కలవు మాయలు పెక్కు గల్పించేవి
తలఁచి శ్రీవేంకటేశు దాసుఁడైన భాగ్య మిది
గలిగె నిట్టే మాకుఁ గాణాచి గాని