పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/409

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0271-02 గుండక్రియ సం: 03-407 శరణాగతి


పల్లవి :

పొదలఁ బొదలఁగఁ దనువు పుణ్యపాపముపొత్తు
వదల వదలఁగ మనవద్దనే నిలుచు


చ. 1:

పెరుగు నింద్రియసుఖము పెంచఁగాఁ బెంచఁగా
ధరఁ బెరుగుఁ గోరికలు తలఁచఁ దలఁచ
కెరలు లంపటము మిక్కిలి కూర్చుఁ(ర్చఁ?) గూర్చఁగా
మరలింప మరలింప మనసులో నణఁగు


చ. 2:

కలుగు పనులే మైనఁ గడుఁ జేయఁ జేయఁగా
మలసి కలుగును రుచులు మరుగ మరుగ
బలియు నజ్ఞానంబు భ్రమయఁగా భ్రమయఁగా
నిలువ నిలువఁగ మనసు నిశ్చలం బవును


చ. 3:

నెగడు గుణములు పెక్కు నించఁగా నించఁగా
మిగుల(లు?) సంసారంబు మెలఁగ మెలఁగ
తగిలి శ్రీవేంకటేశు దగ్గరి కొలువఁగఁ గొలువ
పొగడఁ బొగడఁగ నతఁడు పొంతనే నిలుచు