పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/401

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు:0269-05 దేసాక్షి సం: 03-399 శరణాగతి


పల్లవి :

అల్లనాఁడే యిదెరఁగ మైతిమి గాని
యిల్లిదె దేవుని కృప యీడ నున్నది సుండి


చ. 1:

చేరువవో మోక్షము శ్రీహరిభక్తికిని
ధారుణిఁ గర్మమునకే దవ్వుగాని
యీరీతి నింద్రియముల నించుకంతే దాఁటిన
దూరముగాదు జ్ఞానపుతోవ వున్నది సుండి


చ. 2:

ధరఁ జేతిది వైకుంఠ మతని దాస్యమునకు
పరధర్మముల కగపడదు గాని
అరుదైన యాసల ఆయము వొడిచితేనే
అరసి యాకంతగుండా నందవచ్చుఁ జుండి


చ. 3:

తలఁపులో దక్కె ముక్తి తగు శరణాగతికి
శిలుగుఁ బుణ్యములకుఁ జక్కదుగాని
తెలిసి శ్రీవేంకటేశు తిరుమంత్రము నాలికెఁ
బలికినాడనే దివ్యపద మబ్బుఁ జుండి