పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/400

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0269-04 భూపాళం సం: 03-398 వైరాగ్య చింత


పల్లవి :

తెలిసియుఁ దెలియను తెగదీ చిక్కేమిటాను
కలకాల మిందుననే గరివడె బ్రదుకు


చ. 1:

దేహముపై రోఁత తెలుసుకొనేటి వేళ
ఆహా యిదే హేయమై తోఁచును
మోహించి విషయాల మునిఁగిన వేళ నిదే
యీహల నంతటిలోనే ఇతవులై వుండును


చ. 2:

చదివి నేఁ బురాణాలు సారెకు వినేటి వేళ
అదివో విరతి ఘనమై వుండును
కదిసి సంసార సుఖకాంక్షలఁ బొందేటి వేళ
మది నన్నియు మరచి మద మెక్కి వుండును


చ. 3:

యెక్కడిది వివేక మెవ్వరు గెలిచినారు
చక్కఁ బొడవెక్కించు చరిఁ దోసును
దిక్కు నీవే శ్రీవేంకటదేవుఁడ నీ శరణంటే
యెక్కువ బ్రదుకుఁదోవ యిదియే కలది