పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/397

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0269-01 లలిత సం:03-395 భక్తి


పల్లవి :

తప్ప దీయర్థమొకటి దాఁచిన ధనము సుండీ
విప్పరాదు చెప్పరాదు వేదమందు నున్నది


చ. 1:

హరిభక్తి గలిగిన యతనికి మోక్షము
పొరుగున నున్నట్టు పొసఁగినది.
దరిశనభక్తి చేఁ దనరినవారికి
యిరవైన మోక్షము యెదిటిది


చ. 2:

మక్కువ భాగవతాభిమానము గలవారి-
కక్కరలేని మోక్ష మరచేతిది
నిక్కి యాచార్యాభిమాననిరతులైనవారికి
తక్కక మోక్షమింతాఁ దనలోనిది


చ. 3:

యెంత విచారించుకొన్నా నేనేమి చదివినా-
నెంతవారికైనా మోక్ష మిందులోనిది
వింతగా శ్రీవేంకటవిభుని సంకీర్తన-
వంతులకు మోక్షము వదనములోనిది