పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/393

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు:0268-03 బౌళి సం: 03-391 మనసా


పల్లవి:

బాపురే వోప్రాణి బాపురె వోమనసా
వోపనస వెందుకైనా నొడఁబడేవు


చ. 1:

మురికి దేహమొకటి మోచుక నీ ఎప్పటిని
మురికి దేహసతుల మోవఁగోరే ఎప్పటిని
కరకు హేయము గొంత కడుపున నించుకొని
తిరిగి హేయమేకాను (?) తినఁబోయే వప్పటి


చ. 2:

పసిఁడి కమ్ముడుపోయి పరులఁగొలిచి మరిఁ
బసిఁడి సొమ్మంటాఁ బైఁ బెట్టఁ గోరేవు
పిసరుఁ బాపపుణ్యాలఁ బెడఁగేలు గట్టించుక
విసువక అవియే కావించఁబోయే వప్పటి


చ. 3:

పంచభూతములచేతఁ బట్టువడి కమ్మరాను
పంచభూతాల దేహుల బంధులంటాఁ దగిలేవు
అంచెల శ్రీవేంకటేశుఁ డాతుమలో నున్నవాఁడు
యెంచుక తెలిసియును ఇట్టె మరచే వప్పటి