పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/392

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0268-02 లలిత సం: 03-390 శరణాగతి


పల్లవి:

ఆడుతాఁ బాడుతా నీతో నట్టే ముద్దుగునుసుతా
వోడక నీదండ చేరి వున్నారమయ్యా


చ. 1:

ఆసఁ దల్లిదండ్రిమోము అట్టె చూచి శిశువులు
యే సుఖదుఃఖములుఁ దా మెరఁగనట్టు
వాసుల శ్రీపతి మిమ్ము వడి నాత్మఁ దలఁచుక
యీసుల పుణ్యపాపము లెఱఁగమయ్యా


చ. 2:

యేలినవారు వెట్టగా నేపునఁ దొత్తులు బంట్లు
ఆలకించి పరుల బోయడుగనట్టు
తాలిమి శ్రీపతి మీరు తగ మమ్ము రక్షించఁగా
యేలని యేమియుఁ గోర నెరఁగమయ్యా


చ. 3:

చేతఁ జిక్కి నిధానము చేరి యింటఁగలవాఁడు.
యేతులఁ గలిమిలేము లెరఁగనట్టు
ఆతుమలో శ్రీవేంకటాధిప నీ వుండఁగాను
యీతల నే వెలుతులు నెరఁగమయ్యా