పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0258-02 ముఖారి సం: 03-332 నామ సంకీర్తన


పల్లవి :

గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిపుడు
ఆవల నీవల నోరఁ గుమ్మలుగ నాడుద మీతనిఁ బాడుదము


చ. 1:

సత్యము సత్యము సకలసురలలో
నిత్యుఁడు శ్రీహరి నిర్మలుఁడు
ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల
అత్యంతము శరణనరో యితని


చ. 2:

చాటెడి చాటెడి సకలవేదములు
పాటించిన హరి పరమమని
కూటఁస్థుఁ డితఁడు గోపవధూపతి
కోటికి యీతనిఁ గొలువరో జనులు


చ. 3:

నిలుచున్నాఁ డిదె నేఁడును నెదుటను
కలిగిన శ్రీవేంకటవిభుఁడు
వలసినవారికి వరదుఁ డీతఁడు
కలఁడు గలఁ డితనిఁ గని మనరో