పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0257-05 లలిత సం: 03-330 శరణాగతి


పల్లవి :

ఎవ్వరివాఁడాఁ గాను యిదె పిరివీకులై
నవ్వుచు నీ శరణంటి నన్నుఁ గావవయ్యా


చ. 1:

తగఁ బంచేంద్రియములు తమవాఁడననేరు
వగఁ దల్లిదండ్రి తమవాఁడననేరు
చిగురుఁగర్మాలు తమసీమవాఁడననేరు
తెగదీ తగవు నీవే తిద్దవయ్యా


చ. 2:

కొందరు నరకమందు కొంతవళకు వేసేరు
కొందరు స్వర్గమువారు కొంతవళకు వేసేరు
యిందుకు నందుకుఁ బోనీ రిహలోకమందువారు
దిందుపడని వళకు తీరుచవయ్యా


చ. 3:

కాంతలు తమవాఁడంటాఁ గనుచూపులఁ గట్టేరు
చెంతలఁ గాంచనములు చేయిపట్టుకొనే నన్ను
ఇంతటా శ్రీవేంకటేశ యెదలోనున్నాఁడవు
వంతుకీ తగవు నీవే వహించుకోవయ్యా