పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0254-03 గుండక్రియ సం: 03-310 గురు వందన, నృసింహ


పల్లవి :

అందాఁకా వైష్ణవ మటకటకే
నిందకుఁ బాసిన నిర్మలుఁ డగును


చ. 1:

పాపపురాసులు పరిహరమైతే
దీపించు హరిభక్తి వొడమును
చేపట్టి పుణ్యము చేరువలయితే
శ్రీపతిదాసుల సేవే దొరకు


చ. 2:

కొట్టఁగొనకు మతి గోరి పారితే
జట్టిగ హరికథ చవిగలుగు
పట్టిన జన్మము పావనమైతే
మట్టులేని తిరుమంత్రము దొరకు


చ. 3:

గురుకటాక్ష మొకకొంత సోఁకితే
శరణాగతి నిశ్చల మవును
యిరవుగ శ్రీవేంకటేశ్వరుఁ గొలిచితే
పరమపదమునకుఁ బాత్రుండవును