పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0254-02 దేసాళం సం: 03-309 శరణాగతి


పల్లవి :

ఇంతగా మన్నించి నన్ను నేలుకొంటి విలలోన
వింతగా నెవ్వరినిఁక వేఁడఁబొయ్యేనయ్యా


చ. 1:

కలవారిలోన నీవు గలవాఁడవని నేను
కలసి లేనివారిలో కర్మములేనివాఁడను
బలువులలో నీ దాస్యబలవంతుఁడ నేను
యెలమి మాకిఁకఁ జూడనేమి గడమయ్యా


చ. 2:

నెమ్మది లోనివారిలో నీకుక్షి లోపలివాఁడ
నమ్మని వెలివారిలో నాస్తికుల వెలివాఁడ
పమ్మి పదస్థులలోన పరమపదమువాఁడ
ఇమ్మని నిన్నడిగేది ఇఁక నేఁటిదయ్యా


చ. 3:

ధర్మపువారిలో నీ దయాధర్మపువాఁడ
మర్మపువారిలో నీమాయలమర్మమువాఁడ
అర్మిలి శ్రీవేంకటేశ అంతర్యామివి నీవు
నిర్మించినవాఁడ నేను నెలకొంటినయ్యా