పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0205-02 సాళంగనాట సం: 03-026 వైష్ణవ భక్తి

పల్లవి:

అద్దిరా వోయయ్య నేనంతవాఁడనా! వొక-
కొద్ది నీ దాసుల సేవ కోరఁగల గాక

చ. 1:

హరి నీమాయలకు నే నడ్డము చెప్పేవాఁడనా
అరిదైన దదియు రాచాజ్ఞ గనక
పరమపదాన కాసపడుటయు ద్రోహము
సారిది నీ భండారము సొమ్ము గనక

చ. 2:

పంచేంద్రియముల నేఁ బారఁదోలేవాఁడనా
ముంచి నీవు వెట్టినట్టి ముద్ర కర్తలు
అంచల నా విజ్ఞాన మది దలఁచవచ్చునా
నించి నీవు పాఁతినట్టి నిధాన మది

చ. 3:

వొట్టి సంసారపుమోపు వోపననేవాఁడనా
వెట్టి మమ్ము జేయించేటి వేడుక నీది
గట్టిగా శ్రీవేంకటేశ కదిసి నీ శరణంటి
ఱట్టుగ నేఁ జెప్పేనా మీఱఁగ నీ రహస్యము