పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0244-05 భూపాళం సం: 03-252 శరణాగతి

పల్లవి:

నిత్యానందులము నిర్మలులమిదే నేము
సత్యముగ మమ్మాతఁడు సరిఁ బుట్టించఁగను

చ. 1:

యెక్కడవోయి వెదకే మిటమీఁద దైవమును
వొక్కట నంతర్యామై వున్నాఁడదె
ఇక్కడ నాతనిగుణా లెన్నేసి చదివే మిఁక
పక్కన తన దాసుల భక్తికి సులభుఁడు

చ. 2:

యేమేమి వేఁడుకొనేము యిటమీఁద నాతని
నామములు నాలికపై నటించీనదే
నేమమున నింకా నెట్టు నిచ్చలు భుజించేమో
కామించి సంసారపు కైంకర్య మాతనిదే

చ. 3:

ధ్యాన మేమని సేసేము తలఁచినందెల్లాను
పూని శ్రీవేంకటేశుఁడే వుండఁగాను
నానాఁట నిఁక నేమి నమ్మితి మనేదేమి
పేని మమ్ముఁ దన కుక్షిఁబెట్టి పెంచఁగాను