పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0244-04 సాళంగనాట సం: 03-251 శరణాగతి

పల్లవి:

ఇంకనేల నాకు వెరపింతమాట గలిగియు
సంకెలెల్లఁ బాసె నాస్వతంత్రము లొక్కటే

చ. 1:

నేనెంత పాపబుద్ధినై నేరమెంత సేసినాను
కానీలే నన్నెలేవాఁడు కావఁగలఁడు
ఆనతిచ్చెఁ దొల్లె యాతఁ డదె చరమార్థమందు
మేనిదోసమెల్లఁ బాపి మేలొసఁగేననుచు

చ. 2:

మట్టులేకతనినెంత మరచి నే వుండినాను
పుట్టించిన దేవుఁడే ప్రోవఁగలఁడు
గుట్టుచూపె తొల్లె తన గుణము పాండవులందు
గట్టిగాఁ దనవారైతే కాచుకుందుననుచు

చ. 3:

తప్ప నే నడచినాను తగిలి శ్రీవేంకటేశుఁ-
డొప్పులు సేసి రక్షించ నొద్దఁగలఁడు
చెప్పనేల గోపికలు సేసిన దోసాలు దొల్లి
కప్పుక పుణ్యాలు సేసె ఘనుఁడఁ దాననుచు