పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0243-05 దేసాక్షి సం: 03-246 శరణాగతి

పల్లవి:

పుట్టుగు నీయాధీనమే భోగము నీయాధీనమే
అట్టే యీభావనకు నరుదయ్యీ నాకు

చ. 1:

కాననట్టుండవచ్చు నీకల్పిత సుఖదుఃఖాలు
మేను మోచి మీయాజ్ఞ మీరవచ్చునా
నానాజీవులు పడే నాలిఘోరములు చూచి
దీనికెంత వగతువో దేవ నీ చిత్తానను

చ. 2:

తొట్టిన పాపపుణ్యాలు తొల్లి నీపంపులే
పుట్టిన మీ మాయలెల్లాఁ బో దొబ్బేమా
వొట్టుకొన్నజీవులు వొరలుచుండఁగఁ జూచి
యెట్టు నీవోరిచేవో యీవేదన కిపుడు

చ. 3:

చెచ్చెర యీజన్మములు శ్రీవేంకటేశ్వర నీవే
యిచ్చినవి నీతోడ నెదురాడేమా
నిచ్చలు మావంటివారి నేరుపు నేరాలు చూచి
వచ్చి నే శరణనఁగా వహించుకోవలసె