పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0243-02 వసంతవరాళి. సం: 03-243 అధ్యాత్మ

పల్లవి:

వట్టి స్వతంత్ర మిందు లేదు వావాద మిందు లేదు
గుట్టు దెలియక లోలో గునిసేరు వీరివో

చ. 1:

నేరిచి బ్రదుకువారు నేరక వీఁగేటివారు
యేరీతిఁ జూచినాను యెవ్వరు లేరు
తీరుగాఁ దమలోనుండే దేవుఁడు పెరరేఁచఁగా
మేరతోనే జీవులెల్లా మెరసేరు వీరివో

చ. 2:

కొందరు గొప్పజీవులు కొందరు చిన్నజీవులు
యెందుఁ జూచినా భూమి నెవ్వరు లేరు
బొందులే వేరువేరుగాఁ బుట్టించె దేవుఁడే
అందాలు సేయఁగ లోకు లమరేరు వీరివో

చ. 3:

అసుర కాణాచివారు అమర కాణాచివారు
యెసఁగ విచారించుకో నెవ్వరు లేరు
వెస శ్రీవేంకటేశుఁడు వినోదించినయట్టు
వసుధ మీఁదటఁ గానవచ్చేరు వీరివో