పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0234-06 లలిత సం: 03-197 అధ్యాత్మ

పల్లవి:

మంగళసూత్ర మొక్కటే మగనాలికిఁ గట్టేది
అంగవించే మీఁదిపన్నులన్నియు విభునివే

చ. 1:

తలఁపు లోపల నిన్నుఁ దలఁచినానుఁ గలవు
తలఁచకున్నా నంతరాత్మవై కలవు
పలుపూజ లిఁకనేల భక్తిసేయనేల నీవు
గలవని నమ్మేదొక్కటే బుద్ధిఁ గాకా

చ. 2:

మొక్కినా రక్షింతువు మొక్కకున్నా జగములో
యిక్కువతో రక్షింతువు యెపుడు నీవు
పెక్కు విన్నపాలేల పిలిచి యలయనేల
తక్కక నమ్మేటిది నీదాస్య మొక్కటే

చ. 3:

కడు సుజ్ఞానినైనా నీగర్భవాసమే వునికి
వెడ నజ్ఞానినైనాను విడిదక్కడే
బడినే శ్రీవేంకటేశ పలునా వుద్యోగాలేల
నిడివి నిన్ను నుతించే నేమమే నాది