పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0224-06 శంకరాభరణం సం: 03-137 శరణాగతి

పల్లవి:

పట్టి పిసుక నిఁక బనిలేదు
గుట్టు దెలిసితే గులగులలు

చ. 1:

ఆలకించితే నంతా హేయమె
సోలి భోగములు సుజ్ఞానికి
మేలు దెలుసుకొని మెచ్చెదమంటే
నాలికెఁ గడచితే నరకములు

చ. 2:

యెంచి చూచితే నింతా నెరవె
పొంచి ప్రపంచము పుణ్యునికి
దించక తిరిగే తిమ్మటలన్నియు
అంచల వెఱ్ఱుల అలమటలు

చ. 3:

పట్టినదెల్లా బ్రహ్మానందమె
గట్టిగ శరణాగతునికిని
యిట్టె శ్రీవేంకటేశు కరుణ నిఁక
పుట్టినప్పుడే భోగ్యములు