పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0219-05 దేవగాంధారి సం: 03-106 అధ్యాత్మ

పల్లవి:

ఒరసి చూడఁగబోతే నొకటి నిజములేదు
పొరల మేను ధరించి పొరలఁగఁ బట్టెను

చ. 1:

పాతకములట కొన్ని బలుపుణ్యాలట కొన్ని
యీతల స్వర్గనరకాలిచ్చేవట
యేతుల నందుఁ గొన్నాళ్లు యిందుఁ గొన్నాళ్లు
పోతరించి కాతరించి పొరలనే పట్టెను

చ. 2:

పొలఁతులట కొందరు పురుషులట కొందరు
వెలుఁగును జీఁకట్లు విహారమట
కలవరింతలు గొంత ఘనసంసారము గొంత
పొలసి జీవులు రెంటాఁ బొరలఁగఁ బట్టెను

చ. 3:

వొక్కవంక జ్ఞానమట వొక్కవంకఁ గర్మమట
మొక్కి ఇహపరాలకు మూలమిదట
తక్కక శ్రీవేంకటేశుదాసులై గెలిచిరట
పుక్కట నిన్నాళ్లు రంటాఁ బొరలఁగఁ బట్టెను