పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0219-04 రామక్రియ సం: 03-105 అధ్యాత్మ

పల్లవి:

చవులకుఁ జవి సంసారము
భవము నానాఁటికి పచ్చిదే

చ. 1:

దైవికము మా స్వతంత్రముతోఁ గూడె
సావివోదెన్నఁడు సంసారము
పూవుపిందెవలెఁ బొడమివున్నవి
యేవల యీరెండు నేకమే

చ. 2:

పాపముఁ బుణ్యము పైపైఁ గూడుకొని
చాపకింది నీరు సంసారము
రేపుమాపు వలె రెట్టించి వున్నవి
యేపొద్దు నీ రెండు నేకమే

చ. 3:

మాయ గొంత నిజమార్గమునుఁ గొంత
చాయ దప్ప దిదేసంసారము
చేయిచ్చి వున్నాఁడు శ్రీవేంకటేశుఁడు
యీయెడ నీరెండు నేకమే