ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. ఆ. రేకు: 0006-06 లలిత సం: 10-036
పల్లవి:
భారము నీదిగాన పట్టి విన్నవించేఁ గాక
ఆరితేరి బుద్దెరిఁగే దది యెన్నఁడయ్యా
చ. 1:
వీలనిసంసారపువెట్టి నేఁ జేయఁగాను
యేలిన నిన్నుఁ గొలిచే దెన్నఁడయ్యా
కాలమెల్లా విషయాల గాడినె కట్టుండఁగాను
ఆలించి నీసేవ సేసే దది యెన్నఁడయ్యా
చ. 2:
బట్టబయలు మాయలబారిఁ బడివుండగాను
యిట్టె నిన్నుఁ దలఁచే దెన్నఁడయ్యా
వుట్టిపడేకోరికల వువ్విళ్లూరఁగాను
అట్టె నిన్నుఁ బొగడే దది యెన్నఁడయ్యా
చ. 3:
సొలసి నాలుక నూరసుద్దులె తడవఁగాను
యిలపై నిన్ను నుతించే దెన్నఁడయ్యా
కలిగి నన్నును శ్రీవెంకటనాథ కాచితివి
ఫలియించెఁ దపము యీబాగు లెన్నఁడయ్యా