Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 20-3 ముఖారి సం: 10-116

పల్లవి:

ఉపదేశ మిచ్చెగా వువిద మా కెల్లాను
యిపుడు నీ మన సాపె యెట్లా నెరిఁగెనో

చ. 1:

కలికి నిన్నునుఁ బాదకమలానఁ బూజించె
నెలపై దేవర వని నేము మొక్కఁగా
వులివచ్చి నవ్వులతో వున్నాఁడ వందుకునీవు
మెలమి నీ మన సాపె యెటులా నెరిఁగెనో

చ. 2:

తరుణి నీకు వుక్కిటితమ్ములాన విందు వెట్టె
వొర వని నేము నిన్ను దొడ్డసేయఁగా
సరసాన నీవూ నది చవి సేసు కున్నాఁడవు
యిరవై నీ మన సాపె యెటులా నెరిఁగెనో

చ. 3:

మగువ నిన్ను బూతుమాఁటలు కొనియాడె
నిగిడి యేలికె వని నేము గొల్వఁగా
నగుతా శ్రీవెంకటనాథ మమ్ముఁ గూడితివి
యెగువ నీ మనసాపె యెటులా నెరిఁగెనో.