Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. ఆ. రేకు: 0003-03 గుజ్జరి సం: 10-015

పల్లవి:

చంచలమతులకుఁ దెలియునే సాత్వికధర్మములు
మంచమునీడవలె బహుమార్గములై తోఁచున్‌

చ. 1:

తీపుల అల్పపుచదువుల తెలివేలా కలుగు
కాపై మిడుఁగురుబురువులఁ గడచునె చీఁకట్లు
పైపై ప్రాకృతద్రిష్టికి పరమేలా కలుగు
పాపము కనుమాయలవలె భ్రమయించుఁ గాక

చ. 2:

కొద్దెరఁగని జడునికి సద్గుణ మేలా కలుగూ
అద్దము చిలు ముబ్బినక్రియ అజ్ఞానము వొడమున్‌
నిద్దము కామాతురునకు నిజ మేలా తెలియూ
వద్దనె యండమావులవలెఁ దోఁచుఁ గాక

చ. 3:

అనువుగ నక్షయపుణ్యము అది యేలా చెడును
పెనఁగెటి తననీడవలెనె పెడవాయదు యెపుడు
ఘనుఁడగుజీవుఁడు శ్రీవెంకటనాథునిఁ గని నా
పనివడి రత్నము సానఁబట్టినగతిఁ జెలఁగున్‌