ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 14-5 నాదరామక్రియ సం: 10-082
పల్లవి:
రారా చిన్నన్నా రా రోరి చిన్నవాఁడ
రార ముద్దులాఁడ రా రోరి బాలకృష్ణ
చ. 1:
కిందిచూపుల గిలిగించి ఆల
మంద గొల్లెతల మరిగించి
సందడి వలపించి జవరాండ్ల వూర
వింద వైనయట్టి వేడుకకాఁడ
చ. 2:
కొదలుమాఁటలనె గొణఁగుచు భూమి
సుదతుల శిగ్గులు చూరాడి
చిదుగుచేఁతలనె చెనకుచు ముద్దుఁ
బెదవిచవులు చూపిన జాణకాఁడ
చ. 3:
కలికితనముననె కరఁగించి కాచె
చెలుల కాఁగిటనె చెలఁగి
లలనామణి యైన లకిమమ్మఁ
గలసుక శ్రీవెంకటనాథుఁడైనవాఁడ