Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 09-4 వరాళి సం: 10-051

పల్లవి:

నీ వేల వత్తువయ్య నెలఁతఁ బాసి
మావంటివారు నీకు మనసయ్యేరా

చ. 1:

ఇప్పటికి మాతోడ యిచ్చక మాడేవు గాక
తప్పరాని బాస నీవు దాఁటఁ గలవా
అప్పసమై తలఁపెల్లా ఆపెకుఁ గుదువవెట్టి
దెప్పరమై మావెంటఁ దిరుగ నోపుదువా

చ. 2:

నిక్కమువంటి మాఁటలే నెరుపేవు గాక నీవు
వొక్కమనసై యీడ నుండఁ గలవా
అక్కజపు నీమేను ఆపెకు మీదుచ్చి
యిక్కడ మాతొంటిపొందు యితవయ్యీనా

చ. 3:

ముచ్చట సేక మాతో మొగమోడే వింతే పక్క
మచ్చికయాపె కాఁగిలి మాన గలవా
కచ్చుపెట్టి నన్ను శ్రీవెంకటనాథ కూడితివి
యెచ్చరిక నిట్టె మాయింటికి రాఁగలవా