పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0317-3 మంగళకౌశిక సంపుటం: 11-099

పల్లవి: తానె యెరఁగఁదా తనలాగు
         మోనాన నే నొక్కమారు మొక్కితేనె చాలునే

చ. 1: పిలువ నేర్చినవాఁడు ప్రియము చెప్ప నేరఁడా
       వెలిని లోనను విన్నవించ నోపనే
       తలఁపు దెలిసేవాఁడు తమకించ నేరఁడా
       పలుమారు నతనిఁ జేయి వట్టి తియ్య నోపనే

చ. 2: ఆయము అంటినవాఁడు అవ్వలిపని నేరఁడా
       రేయిఁ బగలు నాతని రేఁచ నోపనే
       చాయగా నవ్వినవాఁడు చవి గోన నేరఁడా
       పాయపురచన లెల్ల బచరించ నోపనే

చ. 3: కన్నుల జూచినవాఁడు కాఁగిలించ నేరఁడా
       వున్నతపుగుబ్బల నే నొత్త నోపనే
       యిన్నిటా శ్రీవెంకటేశుఁ డిట్టె నన్నుఁ గూడెను
       వెన్నెలబాయిట నంత వేసరించ నోపనే