పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/528

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0౩90-06 బౌళిరామక్రియ సం: 04-525 హనుమ

పల్లవి:

వీఁడివో కలశాపుర వీరహనుమంతుడు
వాఁడిమి మెరసినట్టి వజ్రపాణి యితఁడు

చ. 1:

చలపట్టి జంగచాఁచి జలధి దాఁటినవాఁడు
తల కొన్న రాముని ప్రతాపపువాఁడు
యెలమి సీతకుంగరమిచ్చి మెప్పించినవాఁడు
కలగుండు వడ లంకఁ గాలిచినవాఁడు

చ. 2:

మగిడి రాఘవునకు మణి దెచ్చినట్టివాఁడు
గగనము మోచిన కాయమువాఁడు
మొగి సూర్యునిచే శాస్త్రములు చదివినవాఁడు
పగటున మీఁది బ్రహ్మ పట్టమేలే వాఁడు

చ. 3:

యిప్పుడూఁ బ్రాణముతోనే యిల దేవుఁడైనవాఁడు
చెప్పఁగొత్తైనమహిమ జెన్నొందువాఁడు
ముప్పిరి శ్రీ వేంకటేశు మూల బలమైన వాఁడు
వొప్పగు వరా లిందరి కొసగేటివాఁడు