పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/527

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: ౦౩9౦-05 శంకరాభరణం సం: 04-524 నృసింహ

పల్లవి:

ఆదిమూర్తి యీతఁడు ప్రహ్లాద వరదుఁడు
యేదెనఁ జూచినా దానె యీతఁడిది దేవుఁడు

చ. 1:


నవ్వుల మోము తోడ నరసింహ రూపు తోడ
జవ్వని తొడ మీఁదట సరస మాడ
పువ్వుల దండలు యిరు బుజాలపై వేసుకొని
వువ్విళ్ళూరఁ గొలువై వున్నాఁడు దేవుఁడు

చ. 2:

సంకుఁ జక్రములతోడ జమళి కోరల తోడ
అంకెలఁ గటియభయహస్తా లెత్తి
కంకణాలహారాలతో ఘన కిరీటము వెట్టి
పొంకమైన ప్రతాపానఁ బొదిలీ నీ దేవుఁడు

చ. 3:

నానా దేవతల తోడ నారదాదుల తోడ
గానములు వినుకొంటా గద్దెపై నుండి
ఆనుక శ్రీ వేంకటాద్రి నహో బలము నందు
తానకమై వరాలిచ్చీ దాసులకు దేవుఁడు