పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/468

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0380-03 శుద్ధవసంతం సం: 04-466 నృసింహ

పల్లవి:

చేకొన్న భక్తుల పాలి చింతామణి
సాకారమై వున్నాఁడు సర్వేశ్వరుడు

చ. 1:

వాఁడిగోళ్లచేత వడి హిరణ్యునిఁ జంపి
వేడుక నెత్తురు లెల్ల వెదచల్లుచు
పోఁడిమి నరసింహుఁడై పొడచూపె నల్లవాఁడె
మూఁడు మూర్తులకును మూల మీతఁడు

చ. 2:

కొండమీఁదఁ గూచుండి కోప ముపసంహరించి
అండనున్నదేవతల కభయమిచ్చి
మెండుగ సులభుఁడై మెరయుచు నున్నవాఁడు
దండి జగముల కెల్ల దైవ మీతఁడు

చ. 3:

వేవేలు చేతులను వెస నాయుధాలు వట్టి
చేవ మీరి ప్రతాపాన సిరులు మించి
యీవల నహోబలాన నిరవై యున్నవాఁడు
శ్రీ వేంకటాద్రి మీఁది సిద్ధమూర్తి యీతఁడు